
DNews:21 Nov:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో నిషేధిత గంజాయి సాగు బయటపడింది. బహిరంగ ప్రదేశాల్లో పెంచితే పట్టుబడతామనే భయంతో ఓ యువకుడు ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల అనుమానాస్పద సమాచారం ఆధారంగా పోలీసులు చేసిన దాడిలో నిజం బయటపడింది.
పల్కపల్లి గ్రామానికి చెందిన నాగనులు మధు అనే యువకుడు గంజాయికి బానిసై, తన ఇంట్లోనే గంజాయి మొక్క సాగు చేస్తున్నాడు. ఇటీవల పోలీసులు గంజాయి సాగు, విక్రయాలు, రవాణాపై కఠినంగా వ్యవహరిస్తూ దాడులు చేపడుతుండటంతో మధు ఇంట్లోనే సాగు చేస్తూ తప్పించుకుందామని చూశాడు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు మధు ఇంటిపై దాడి చేసి గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
