
DNews:21 Nov:ఖమ్మం జిల్లాలో యువకుల పోకిరి చేష్టలు చర్చనీయాంశం అయ్యాయి. కూసుమంచి వద్ద జాతీయ రహదారిపై నిబంధనలు పట్టించుకోకుండా నాలుగు మంది యువకులు బైక్‌లపై స్టంట్లు చేస్తూ రచ్చకెక్కారు. రెండు బైక్‌లపై ప్రయాణిస్తూ పెద్ద శబ్దాలు చేస్తూ, ఇతర వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలిగించారు. హైవేపై అత్యంత ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ పలువురిని భయాందోళనలకు గురిచేశారు.
ఈ ఘటనను కొందరు వాహనదారులు తమ ఫోన్లలో వీడియోగా రికార్డ్ చేసి పోలీసులకు పంపారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోలో కనిపించిన బైక్ నంబర్లను ఆధారంగా తీసుకుని ఆ యువకుల గుర్తింపుపై దృష్టి సారించారు. వీరిని గుర్తించడంలో సహకరించాలంటూ ఖమ్మం రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
