
DNews:20 Nov:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఇందుకోసం 20 వేల పోస్టులతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేయాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే TGLPRB (తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి) బోర్డుకు మరియు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా, ఒక్క పోలీస్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని జేఏసీ ప్రతినిధులు మండిపడ్డారు.
జేఏసీ ప్రతినిధులు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ప్రధానంగా ఈ కింది డిమాండ్లను ప్రస్తావించారు:పోలీస్ శాఖలోని అన్ని ఖాళీలను కలుపుకుని తక్షణమే 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి.నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలి. జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దు చేయాలి.లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలి.స్థానిక సంస్థల ఎన్నికల లోపు పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వకపోతే, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబునాయక్, సందీప్, చెర్రీ ప్రవీణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
