
DNews:17 NOV:హైదరాబాద్ పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతులు ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారనే విషయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కళ్ల ముందే పండించిన పత్తి చలికాలపు తేమకు పాడవుతుంటే, రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ‘మొద్దు నిద్ర’లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం ఉన్నప్పటికీ, కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు కావడం రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోలు సంక్షోభానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడింగ్ వంటి పేర్లతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోళ్లకు అంగీకరించకపోవడం, కొంతమంది జిన్నింగ్ మిల్లుల అవినీతి రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.మద్దతు ధర దక్కక మధ్య దళారులపై నమ్మకం పెట్టుకుని రైతులు నష్టాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
