
DNews:06 NOV:హైదరాబాద్ చేవెళ్ల రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డును బాగు చేయాలని ధర్నా చేసిన 25 మంది స్థానికులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.అయితే, పోలీసుల ఈ చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తమ భద్రత కోసమే ధర్నా చేశామని, కానీ తమపై కేసులు వేయడం అన్యాయం అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే మీర్జగూడ వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్న ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన అనంతరం స్థానికులు రోడ్డు దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే, రహదారి మెరుగుపరచాలని శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రేపింది. రేవంత్ సర్కార్‌పై చేవెళ్ల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
మీర్జగూడ బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) సుమోటోగా స్వీకరించింది.ఈ ఘటనపై డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని రవాణా, హోం, భూగర్భ గనుల శాఖల ప్రధాన కార్యదర్శులతో పాటు జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది.
