
DNews:02 Dec:కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డిజిటల్ యుగంలో సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న ఘటనలకు నిదర్శనంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి స్వయంగా తుపాకీ తయారు చేసిన ఒక వ్యక్తి, ఆ తుపాకీతో వ్యాపారిని బెదిరించి, కాల్పులు జరిపిన ఘటన మంగళవారం (డిసెంబర్ 2) చోటుచేసుకుంది.
కౌటాల ప్రాంతానికి చెందిన కుప్రాంకర్ అజయ్.అజయ్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి తుపాకీని తయారు చేశాడు. ఆ తర్వాత ఒక వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.బెదిరింపులకు లొంగని వ్యాపారిపై అజయ్ కాల్పులు జరిపాడు.ఒక్కసారిగా కాల్పులు జరగడంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన బాధితుడు, అదృష్టవశాత్తూ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు.నిందితుడు అజయ్ దౌర్జన్యంపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు.
కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే నిందితుడు కుప్రాంకర్ అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని విచారించగా, యూట్యూబ్‌లో చూసి తుపాకుల తయారీ నేర్చుకున్నట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుందో, దాన్ని ఉపయోగించి విధ్వంసానికి పాల్పడే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటులో ఉన్న ప్రమాదకరమైన కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
