
DNews:22 Dec: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడటంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.Nizamabad నగరంలోని కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ కారును ఆపి అందులో ఉన్న వ్యక్తికి బ్రెతింగ్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సమయంలో సదరు వ్యక్తి ఆగ్రహానికి గురై డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సీఐని నెట్టివేయడంతో పాటు ఆర్ఎస్ఐపై భౌతిక దాడికి పాల్పడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.
మద్యం మత్తులో ట్రాఫిక్ సిబ్బందిపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించాడని ఆర్ఎస్ఐ మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలకల్ రోడ్డు ప్రాంతానికి చెందిన పిట్ల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ ఇన్చార్జ్ ఎస్ఐ నారాయణ వెల్లడించారు.ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ మస్తాన్ అలీ.. డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారెవరైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిట్ల సాయిలుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ పది రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఏసీపీ వెల్లడించారు.డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులను ఏమాత్రం సహించబోమని, ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
