
DNews:12 Dec: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ (శుక్రవారం) లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారనే ఆరోపణతో ఈ నోటీసులు పంపినట్లు కవిత పేర్కొన్నారు.నోటీసులో వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున ‘జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో విస్తృతంగా ప్రజలను కలుస్తున్నారు.గురువారం రోజు మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.కవిత వ్యాఖ్యలకు కృష్ణారావు కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో, వివాదం మరింత ముదిరింది. అదే వివాదం కొనసాగుతుండగా, కవిత ఆయనకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం.
