
DNews:12 NOV:హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఒక కేసులో, మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా మోసం చేసి బ్లాక్మెయిల్ చేసిన విద్యార్థి ఆశం ఆకాష్‌కు నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధించింది. లాలగూడాకు చెందిన మైనర్ బాలికను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న ఆకాష్, ఆమెతో స్నేహం పెంచుకుని వ్యక్తిగత ఫోటోలను సంపాదించాడు. కొంతకాలం తర్వాత, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ డబ్బు కోసం బాలికను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులకు భయపడిన బాలిక డబ్బు కోసం సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడటంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. దీంతో బాధితురాలు లాలగూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆకాష్ మొబైల్, సోషల్ మీడియా అకౌంట్లను సీజ్ చేసి డిజిటల్ ఆధారాలు సేకరించారు. పోలీసులు సమర్పించిన పటిష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు మరియు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆశం ఆకాష్‌ను దోషిగా నిర్ధారించారు. తుది తీర్పుగా నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది.
