
DNews:26 Nov:వేములవాడలో ఓ మహిళా రైతు పత్తి అమ్మగా, దానికి సంబంధించిన డబ్బులు నేరుగా రాజరాజేశ్వర ఆలయ ట్రస్టు ఖజానాలో జమ కావడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటనలో అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు బహిర్గతమయ్యాయి.
వేములవాడకు చెందిన ఏదుల సత్తెమ్మ ఈ నెల 6న నాంపల్లి జిన్నింగ్ మిల్లోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో తన పత్తిని విక్రయించారు.ఆమెకు 11వ తేదీన మొబైల్లో ₹2,14,549 తన ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సందేశం వచ్చింది.నగదు డ్రా చేసుకునేందుకు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఆమెకు, ఖాతాలో డబ్బు లేదని అధికారులు తెలిపారు. దీంతో ఆమె బ్యాంకు, సీసీఐ కార్యాలయాల చుట్టూ తిరిగారు.విచారణ తర్వాత ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.ఆమె ఖాతాలో జమ కావాల్సిన మొత్తం రాజరాజేశ్వర ఆలయ ట్రస్టు ఖజానాలోకి వెళ్లింది!
పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు 19 రోజుల తర్వాత, ఈ ఆ మొత్తాన్ని సత్తెమ్మ ఖాతాలో జమ చేశారు.అయితే ఇది ఒక్కసారి జరగలేదు. గత కొన్ని నెలలుగా ఆమె గ్యాస్ సబ్సిడీ నగదు కూడా రాజన్న ఆలయ ట్రస్ట్ ఖజానాలో జమవుతోందని గుర్తించారు.రైతు డబ్బు, సబ్సిడీ ఇలా వరుసగా ఇతర ఖాతాలో జమ కావడం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.సాంకేతిక లోపమా? లేదా డేటా మేనేజ్మెంట్లో తప్పిదమా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.స్థానిక ప్రజలు, రైతు సంఘాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
