
DNews:18 NOV:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం (నవంబర్ 18) హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన పట్టణాభివృద్ధి ప్రాంతీయ సమావేశంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, పలు రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను, వాటి సాధనకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతును వివరించారు.
తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీని సాధించాలనే జాతీయ లక్ష్యంలో భాగంగా, దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కేంద్రం నుంచి ఆర్థిక, సాంకేతిక సహకారం అత్యంత అవసరమని ఆయన కేంద్ర మంత్రికి విన్నవించారు.
అదే సమయంలో, హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు త్వరగా ఇవ్వాలని సీఎం కోరారు. ఇందులో ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవం, ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం, మరియు మెట్రో రైల్ విస్తరణ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా, రాబోయే మూడేళ్లలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడుపుతామని సీఎం ప్రకటించారు.
‘రైజింగ్ తెలంగాణ’ విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణను దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, అందుకు కేంద్రం సహకారం తమకు బలం చేకూరుస్తుందని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విన్నవించారు.
