
DNews:27 Dec: తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జీవో 252 (GO 252) కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (TUWJ H-143) ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం, వారు జిల్లా అదనపు కలెక్టర్ వేణును కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ జీవో జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, కొత్త నిబంధనల వల్ల ఆ సంఖ్య 10 వేలకు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లా మరియు మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేయడం, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి అంశాలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్డులను రద్దు చేసి, కేవలం రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిలకే పరిమితం చేయడం దారుణమని మండిపడ్డారు.
అలాగే మీడియా అక్రిడిటేషన్ కార్డు మరియు మీడియా కార్డు అని రెండు రకాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య వివక్ష చూపడమేనని వారు వాదించారు. ఇది వరకు ప్రతి 50 వేల జనాభాకు ఒక కార్డు ఇచ్చే విధానం ఉండేదని, కానీ ప్రస్తుతం మండలానికి కేవలం ఒకే కార్డు ఇవ్వాలనే నిర్ణయం చిన్న పత్రికలను, క్షేత్రస్థాయి రిపోర్టర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కేబుల్ టీవీ ఛానళ్లకు జిల్లా స్థాయి కార్డులను రద్దు చేయడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో 252ను సవరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి.
