
DNews:27 Dec: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒరిగిందేమీ లేదని, కేవలం మోసపూరిత మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతులకు అందాల్సిన ‘రైతుబంధు’ (రైతు భరోసా) నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు ఎగ్గొట్టిందని, అదొక “దొంగల ప్రభుత్వం” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతులు ఏనాడూ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడలేదని, కానీ నేడు మహబూబాబాద్ జిల్లాలోనే యూరియా బస్తా కోసం అధికారి కాళ్లు మొక్కుతున్న దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. “అన్నదాతను బిచ్చగాడిలా మార్చిన ఘనత రేవంత్ రెడ్డిదే” అని ఎద్దేవా చేశారు. రైతుబంధు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని, మాయమాటలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రైతుల కన్నీటికి కారణమవుతోందని ఆరోపించారు.
రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతులకు ‘బంధువు’ కాదు, ‘రాబందు’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆపదని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
