
D Spiritual: Nov 10: కార్తీక మాసం ప్రాధాన్యం
కార్తీక మాసం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన భక్తులు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యఫలాన్ని పొందుతారు.
కార్తీక మాసం యొక్క ఉద్భవం
కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెలను కార్తీక మాసం అంటారు. కృత్తికా నక్షత్రం కుమారస్వామి జన్మనక్షత్రం. అజ్ఞానాన్ని పోగొట్టేది దీపం. కృత్తిక అగ్ని సంబంధమైనది కావున దీపాన్ని వెలిగించే ఈ మాసాన్ని కార్తీకదీపం అని పిలుస్తారు.
దీపారాధన యొక్క మహిమ
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం” అని శాస్త్రోక్తి ఉంది. జ్యోతి పరబ్రహ్మ స్వరూపం — పరమాత్మ జ్యోతి స్వరూపుడు. దీపారాధన వల్ల మనలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆత్మను చైతన్యవంతం చేయడం జరుగుతుంది.
దీపం వెలిగించే సమయం మరియు విధానం
దీపాన్ని వెలిగించే సమయంలో మనస్సు, శరీరం నిశ్చలంగా ఉండాలి. తెల్లవారక ముందే స్నానం చేసి, ఉదయం 5 నుండి 6:30 గంటల మధ్యలో దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వశ్రేయస్సు కలుగుతుంది.
వివిధ నూనెల ప్రభావం
నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషం నివారణతో పాటు శత్రువుల నాశనం జరుగుతుంది. ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే కూడా శత్రువుల నాశనం కలుగుతుంది. ఈ విధంగా కాకుండా వేరే నూనెలతో దీపం వెలిగిస్తే ఫలితం ఉండదు.
365 వత్తుల దీపం ప్రాముఖ్యం
హిందూ సంప్రదాయంలో ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉదయం దీపారాధన చేయాలి. కానీ అది సాధ్యం కాని సందర్భంలో, కార్తీక మాసంలో 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని సాయంత్ర సమయంలో వెలిగించడం శ్రేయస్కరం.
దీపారాధన ఫలితాలు
సంవత్సరానికి 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. కార్తీక పాడ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ఏ రోజు దీపం వెలిగించినా అది కార్తీకదీపమే. ఈ దీపం కాంతి ప్రసరించిన ప్రాంతమంతా ప్రకృతి, పశుపక్ష్యాదులు, పంటలు, సిరిసంపదలతో విరాజిల్లుతాయి.
