
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం (సెప్టెంబర్ 18) ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు చేపట్టాల్సిన కొత్త చర్యలపై చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించినందుకు UAE అధ్యక్షుడు ప్రధాని మోదీని అభినందించారు. భారత అధ్యక్షతన బ్రిక్స్‌లో UAE చురుకైన భాగస్వామ్యాన్ని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బ్రిక్స్ సదస్సుకు హాజరై అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు.
ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పరిణామాలపైనా మోదీ, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా పరస్పర సహకారం సమన్వయాన్ని కొనసాగించాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
