
D Spiritual: Jan 30: పురాతన కట్టడాల పరిరక్షణకు టీటీడీ చర్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పురాతన కట్టడాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టింది. తిరుమల క్షేత్రంలో వెయ్యేళ్లకు పైబడిన ప్రాచీన కట్టడాలు, రాత్రి మండపాలు, మెట్ల మార్గాలు శిథిలం కాకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ చారిత్రక సంపదను అందించాలనే లక్ష్యంతో ఏఎస్ఐ తరహాలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తోంది.
కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ సెల్ ఏర్పాటు
ఈ క్రమంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఈఓ హోదా అధికారి పర్యవేక్షణలో కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. పురావస్తు శాఖలో అనుభవం ఉన్న అధికారిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి ప్రభుత్వ అనుమతిని కోరింది.
పాదాల మండపానికి పూర్వ వైభవం
స్వచ్ఛంద సంస్థల సహకారంతో పురాతన కట్టడాల పునరుద్ధరణ పనులు చేపట్టిన టీటీడీ, కట్టడాల పటిష్టతతో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించనుంది. ఇందులో భాగంగానే తిరుపతిలోని అలిపిరి పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు రూ.5 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించింది. డాక్యుమెంటేషన్ ప్రక్రియతో పాటు పనులు కొనసాగుతున్నాయి.
చారిత్రక విశిష్టతకు భంగం కలగకుండా పునరుద్ధరణ
విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ పురాతన మండపం కాలక్రమంలో దెబ్బతింది. చారిత్రక విశిష్టతకు భంగం కలగకుండా సంప్రదాయ నిర్మాణ శైలితో పాటు ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ పునరుద్ధరణ చేపడుతోంది. 30 సీసీ కెమెరాలతో విజిలెన్స్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంతవరకు పాత రాళ్లనే వినియోగిస్తూ, పగిలిన రాళ్లను మరమ్మతు చేసి ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన రాళ్లు ఉన్నప్పుడే కొత్త రాళ్లను వాడాలనే నిర్ణయంతో మండప ప్రాచీనతను చెక్కుచెదరనీయకుండా కాపాడుతున్నారు.
ఎనిమిది దశల్లో పునరుద్ధరణ ప్రక్రియ
అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను మొత్తం ఎనిమిది దశల్లో చేపడుతున్నారు. మండపంలోని పైకప్పులు, గోడలు, నేల రాళ్లతో సహా ప్రతి రాయికి నంబర్ వేసి డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. రాళ్లు తొలగించే ముందు ఆటోకాడ్ వంటి సాఫ్ట్‌వేర్‌తో ప్లాన్లు, ఎలివేషన్లు, డ్రాయింగ్స్ సిద్ధం చేసి ప్రతి రాయి ఉన్న స్థానాన్ని నమోదు చేస్తున్నారు. మరోవైపు హెచ్‌డీ కెమెరాలు, డ్రోన్లు, ఫోటోగ్రామెట్రీ ద్వారా లోపల బయట ప్రతి అంగుళాన్ని వీడియో–ఫోటో డాక్యుమెంటేషన్ చేస్తున్నారు.
పాత రాళ్లతోనే పునర్నిర్మాణం
రాళ్లకు ఏమాత్రం దెబ్బ తగలకుండా స్కఫోల్డింగ్ ఏర్పాటు చేసి నిపుణుల పర్యవేక్షణలో ఒక్కో రాయిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. తీసివేసిన రాళ్లను పక్కనే క్రమపద్ధతిలో భద్రపరచి, ఏ రాయి ఎక్కడ ఉంచారో లేఔట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.
పురాతన పద్ధతులతో పూర్వ వైభవం పునఃసృష్టి
పురాతన నిర్మాణ పద్ధతుల ఆధారంగానే కొత్త పునాదిని నిర్మించి, ముందుగా సిద్ధం చేసిన డాక్యుమెంటేషన్ ప్రకారమే ప్రతి రాయిని మళ్లీ అదే స్థానంలో, అదే లెవెల్‌లో అమర్చనున్నారు. పైకప్పు నుంచి నీరు కారకుండా సంప్రదాయ వాటర్ టైటెనింగ్ విధానాలతో పనులు చేపట్టి, పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది.
