
D Entr July 8: జబర్దస్త్ సుజాత ప్రస్తుతం నటిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్, ‘సేవ్ ది టైగర్స్’ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, గతంలో ఓ ఇంటర్వ్యూలో జర్నలిజం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమా పరిశ్రమలో వచ్చే విమర్శలు, పుకార్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తాను జర్నలిజంపైనే దృష్టి పెట్టానని సుజాత తెలిపారు. అయితే డైరెక్టర్ తేజ, రచయిత ప్రదీప్ అద్వైతం నుంచి ఆడిషన్‌కు పిలుపు రావడంతో, తన భర్త రాకింగ్ రాకేష్ ప్రోత్సాహంతో ఆడిషన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ తన ప్రతిభతో ఎంపికైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు ‘మల్లేశం’ సినిమా ఆడిషన్లో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా ఆమె వెల్లడించారు. పాత్ర ఖాయమైనట్లు చెప్పి, చివరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరో నటిని ఎంపిక చేశారని, ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానని, కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఆ సంఘటన తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ‘సేవ్ ది టైగర్స్’ అవకాశం రావడంతో మరోసారి ఆడిషన్‌కు వెళ్లి వెంటనే ఎంపికయ్యానని సుజాత చెప్పారు. ఈ సిరీస్ తన నటిగా కెరీర్‌కు కొత్త మలుపు ఇచ్చిందని, ఈ ప్రయాణంలో తన భర్త రాకింగ్ రాకేష్ అందించిన మద్దతు ఎంతో కీలకమని ఆమె వెల్లడించారు.
