D Entr: Jul 9: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు త్వరలోనే 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా 10వ సీజన్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈసారి ‘దశావతారం’ థీమ్‌తో సీజన్‌ను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రోమోలు సూచిస్తున్నాయి. గత సీజన్ మాదిరిగానే సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ ‘అగ్నిపరీక్ష’ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, త్వరలోనే అగ్నిపరీక్షకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు, సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. రోజుకో సెలబ్రిటీ పేరు వినిపిస్తుండగా, తాజా ప్రచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్, నటుడు అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె ఈసారి బిగ్‌బాస్ 10వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తేజస్విని గౌడ ‘కోయిలమ్మ’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం ‘కేర్ ఆఫ్ అనసూయ’తో పాటు పలు తమిళ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. 2022లో నటుడు అమర్‌దీప్ చౌదరిని వివాహం చేసుకున్న ఆమె, అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో బయట నుంచి అందించిన మద్దతుతో పాటు, వీరిద్దరూ కలిసి చేసిన యూట్యూబ్ వ్లాగ్స్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ నిర్వాహకులు తేజస్వినిని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఆమె, హౌస్‌లోకి రావడానికి భారీ పారితోషికం కోరినట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ప్రచారం ప్రకారం ఆమెకు వారానికి సుమారు రూ.6 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

తేజస్వినితో పాటు చంద్రహాస్, సుప్రీత, అభినవ్ గోమటం, నిరుపమ్ పరిటాల, యాంకర్ శ్యామల, వర్ష తదితర ప్రముఖుల పేర్లు కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే వీరెవరు నిజంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారన్నది నిర్వాహకుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.