
D Spiritual: Nov 11: వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నేడు అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం.. తరలిరానున్న లక్షలాది మంది భక్తులు
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిరూపంగా శ్రీ కురుమూర్తి స్వామిని లక్షలాది మంది భక్తులు కొలుస్తారు. పాలమూరు పల్లె ప్రజల ఇలవేల్పుగా, పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో వైభవంగా ప్రారంభం కానున్నాయి.
పాలమూరు జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న దేవరగట్టు ఏడుకొండల నడుమ కాంచన గుహలో శ్రీ కురుమూర్తి స్వామి కొలువై ఉన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
ముక్కెర వంశీయులు స్వామివారి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. నేటికీ ఆ వంశానికి చెందిన వారే స్వామివారికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.
