
DNews: నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కొత్తగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పట్టణ సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు.
లక్ష మంది రైతులతో బహిరంగ సభ
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ.. నవంబర్ 15న నల్గొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రైతుల సమస్యలపై పోరాటం
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా పోరాడాలని సత్యనారాయణ పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూమి హక్కుల పరిరక్షణ, భవిష్యత్తు ఉద్యమాల కార్యాచరణపై జాతీయ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు.
నవంబర్ 15న జరిగే బహిరంగ సభకు రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, సీఐటీయూ, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
