
D Spiritual: Nov 17:
అనుకున్న పనులు జరగడం లేదు, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలను చేయడం వల్ల పనుల్లో విజయాన్ని పొందవచ్చని చెబుతున్నారు. చాలా సార్లు మనం ఎంత ప్రయత్నించినా పనులు సజావుగా జరగకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం నిరాశ చెందుతుంటాము. అయితే పనులు ఆగిపోవడానికి కొన్ని ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉంటాయని పండితులు చెబుతారు.
ఇకపై బయటకు వెళ్లినప్పుడు కానీ, ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు కానీ, ఆ పని విజయవంతంగా పూర్తవ్వాలి అనుకుంటే ఒక విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని, దానికి పసుపు–కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత దానిని మీతో పాటు బ్యాగులో వేసుకుని తీసుకెళ్లాలి.
మీరు వెళ్లిన పని పూర్తయిన తరువాత ఆ టెంకాయను సమీపంలోని ఏదైనా గణపతి ఆలయంలో అర్పించాలని చెబుతున్నారు. అదేవిధంగా, ఇంట్లో పూజామందిరంలో వక్క గణపతిని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభమని భావిస్తారు. ప్రతిరోజూ ఆ వక్క గణపతికి కుంకుమ బొట్టు పెట్టడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందట.
ఇవి మాత్రమే కాకుండా, ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు మీతో ఒక పసుపు కొమ్ము పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పసుపుకు కార్యసిద్ధిని తీసుకురాగల శక్తి ఉందని నమ్మకం. కాబట్టి పసుపు కొమ్ముతో బయలుదేరితే మీరు వెళ్లిన పనిలో విజయాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.
