
D Spiritual: Nov 15: ద్వారకా తిరుమల : చిన్న తిరుపతి
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి “ద్వారకా తిరుమల” అనే పేరు రావడానికి సంబంధించిన ఆసక్తికర కథనాలు ఉన్నాయి. చిన్న తిరుపతిగా పిలుచుకునే ఈ ఆలయం అనేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది.
చిన్న తిరుపతి పేరుకి కారణం
ఏడు కొండలు, దట్టమైన అడవులు ఉన్న తిరుమల శేషాచలం చేరుకోవడం పురాతన కాలంలో చాలా కష్టమైంది. ‘ఏడేడు శిఖరాలు నే నడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను’ అని బాధపడే భక్తుల కోరిక తీర్చేందుకు శ్రీనివాసుడే ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనే కథనం ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతిగా భావిస్తారు.
ద్వారకుని తపస్సు కథనం
స్థల పురాణం ప్రకారం, ద్వారకుడు అనే మహర్షి ఇక్కడ తీవ్ర తపస్సు చేసి, స్వామి వారి పాద సేవ కోరాడట. అతని భక్తిని అంగీకరించి, స్వామివారు పుట్టలో స్వయంభువుగా వెలిశారని చెబుతారు. ద్వారకుడు ఉత్తరాభిముఖంగా తపస్సు చేయడంతో, స్వామివారు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తున్నారు. పుట్టలో ఉన్నందున భక్తులకు స్వామి వారి నడుము నుండి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ఈ ప్రధాన విగ్రహం వెనుక మరో సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించడమూ ప్రత్యేకతగానే భావిస్తారు.
ఆలయంలో ఎర్ర చీమల విశేషం
ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు చేయరు. విగ్రహం పుట్టలో ఉండటం వలన నీటి బొట్టు పడితే కింద ఉన్న ఎర్ర చీమలు ఇబ్బందిపడతాయని నమ్మకం. అందువల్ల అభిషేకాన్ని నిషేధించారు.
రెండో విగ్రహం ప్రతిష్ఠ కారణం
శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి, భక్తుల కోరిక మేరకు నిలువెత్తు విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించారని చెబుతారు. మొదటి విగ్రహంలో పాదాలు మాత్రమే దర్శనమివ్వడం వల్ల భక్తులు పాద పూజ సేవ పొందాలని కోరడంతో ఈ నిలువెత్తు విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఏటా రెండు సార్లు కల్యాణోత్సవం
ద్వారకా తిరుమలలో ప్రతి సంవత్సరం వైశాఖ మరియు ఆశ్వయుజ మాసాల్లో రెండు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారు వైశాఖ మాసంలో స్వయంభువుగా వెలిశారని, రెండో సంపూర్ణ విగ్రహం ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించబడిందని అందుకే రెండు సార్లు ఉత్సవాలు చేస్తారు.
ఆలయ నిర్మాణం మరియు దర్శన విశేషాలు
ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం కనిపిస్తుంది. ప్రధాన ద్వారం లోపలి భాగంలో ద్వారకా మహర్షి, అన్నమాచార్యుల విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడి చుట్టూ సప్తర్షుల విగ్రహాలు, ప్రదక్షిణ మార్గంలో ఆళ్వారుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. గర్భగుడిలో స్వామివారి రెండు విగ్రహాలు భక్తులను అలరిస్తాయి. కుడివైపు అర్ధ మండపంలో మంగతాయారు, ఆండాళ్ అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను జోడిస్తుంది.
