
D Spiritual: Nov 14: మామూలుగా దేవుడికి పూజ చేసే సమయంలో ఎన్నో నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని వస్తువులను పొరపాటున కూడా నేలపై ఉంచకూడదని పండితులు సూచిస్తున్నారు. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియక, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ తప్పుల వల్ల పూజ చేసినా ఫలితం దక్కకపోవడం మాత్రమే కాదు, ఇంట్లో అవాంఛిత సమస్యలు కూడా వస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈ తరం వారికి పూజ సమయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి తప్పులు ఎక్కువవుతున్నాయి.
పూజ సమయంలో నేలపై ఉంచకూడని వస్తువుల్లో శాలిగ్రామం మొదటిది. శాలిగ్రామం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు. దీన్ని నీటిలో శుద్ధిగా ఉంచి మాత్రమే పూజిస్తారు. అలాంటి పవిత్రమైన శాలిగ్రామాన్ని నేలపై ఉంచడం మహా అపచారం అని శాస్త్రాలు పేర్కొంటాయి. ఇది దేవతలను అవమానించినట్టే అవుతుందని చెబుతారు.
అదేవిధంగా శంఖానికి కూడా లక్ష్మీదేవి నివాసమని భావిస్తారు. అందుకే శంఖాన్ని పూజ సమయంలో కానీ, సాధారణ సమయంలో కానీ నేలపై పెట్టకూడదని సూచిస్తారు. అలా చేస్తే అదృష్టం తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు రావడం వంటి ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయని నమ్ముతారు.
చాలామంది సాధారణంగా చేసే తప్పుల్లో దీపాలను నేలపై పెట్టి వెలిగించడం ఒకటి. దీపం స్వయంగా పవిత్రతకు, శుభానికి ప్రతీక. దీపాన్ని నేలపై పెట్టి వెలిగించడం శాస్త్రోక్తం కాదు. ఎప్పుడూ దీపాన్ని ఒక ప్లేట్ లేదా పళ్లెంలో ఉంచి అక్కడే వెలిగించి, అనంతరం దేవుడి ముందు లేదా తులసి కోట వద్ద పెట్టాలి.
బంగారం కూడా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. అందుకే బంగారాన్ని నేలపై ఉంచడం లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుందని చెబుతారు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం.
దేవుడి విగ్రహాలు, పటాలను నేలపై ఉంచకూడదని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. శుభ్రం చేసే సందర్భంలో కూడా విగ్రహాలను నేరుగా నేలపై పెట్టకుండా, తప్పనిసరిగా ఒక వస్త్రం లేదా కాగితం పరచి మాత్రమే ఉంచాలి. లేకపోతే అది దేవతలను అవమానించే చర్యగా భావిస్తారు.
