
D Spiritual: Nov 17: వాస్తుశాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మిక పండితుల ప్రకారం కూడా ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొనడానికి కొన్ని నియమాలను పాటిస్తారు. వాటిలో గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను లేదా చెట్లను ఉంచడం ఒక ముఖ్యమైన అంశంగా భావిస్తారు. ముఖ్యంగా, ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందని విశ్వసిస్తారు.
ఇంట్లో దరిద్రం ఎక్కువైపోయిందని, ఏ పని మొదలుపెట్టినా కలిసి రావడం లేదని అనుకునేవారు గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే మంచిది అని పండితులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఇంటి వాతావరణం మారుతుందని, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు.
దానికి గాను, గుమ్మం లోపలి వైపు పక్కన ఒక రాగి చెంబు ఉంచాలి. ఆ చెంబులో నీరు పోసి అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, ఐదు రూపాయి నాణేలు, ఒక ఎరుపు పుష్పం, వీలైతే వట్టివేళ్లు ఉంచాలి. ప్రతిరోజూ చెంబులోని నీటిని మార్చాలి. అలాగే పచ్చ కర్పూరం, పుష్పం, వట్టివేళ్లను కూడా కొత్తవాటితో మార్చుతూ ఉండాలి.
ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మి దేవి అడుగుపెడుతుందని, దరిద్రదేవత ఆ ఇంటినుంచి వెళ్లిపోతుందని చెబుతారు. అదేవిధంగా గుమ్మం బయట వైపున కూడా దీపాలను పెట్టడం శుభప్రదమని సూచిస్తున్నారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేసి, గుమ్మం బయట దీపాలు పెట్టే ఇంట్లో దరిద్రదేవత నిలవదని, ఆమె వెళ్లిపోయిన తరువాత లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని నమ్మకం.
