ఏ కూర వండాలన్నా అందులో ఉల్లిపాయ ఉండాల్సిందే! మన వంటల్లో అంతలా భాగమైపోయాయి ఉల్లిపాయలు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఎర్ర ఉల్లిపాయలతో పాటు తెల్ల ఉల్లిపాయలు కూడా కనిపిస్తుంటాయి. చాలామంది ఈ రెండింటి మధ్య తేడా కేవలం రంగులోనే ఉంటుందని భావిస్తారు. కానీ నిజానికి వీటి రుచి, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, వంటల్లో వినియోగం ఇలా ఎన్నో విషయాల్లో తేడాలున్నాయి. మరి ఎర్ర ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయల్లో ఏది దేనికి మంచిది? వీటి ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం ఈ స్టోరీలో..

D news:nov:10 ఎర్ర ఉల్లిపాయలు ఎరుపు లేదా ఊదా రంగులో కనిపిస్తాయి. వీటికి ఆ రంగు రావడానికి ప్రధాన కారణం ఆంథోసయనిన్స్ అనే సహజ వర్ణద్రవ్యాలు. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా ఫ్లేవనాయిడ్లు, క్వెర్సెటిన్ వంటి సహజ వృక్ష సమ్మేళనాలు కూడా లభిస్తాయి.

ఎర్ర ఉల్లిపాయలను సాధారణంగా సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లు, చట్నీలు, బిర్యానీలతో పాటు పచ్చిగా తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల ఎర్ర ఉల్లిపాయల్లో తీపి రుచి కూడా కనిపిస్తుంది. అయితే ఉల్లి రకం, పండించిన ప్రాంతం, సాగు విధానాన్ని బట్టి రుచిలో మార్పులు ఉంటాయి.,

తెల్ల ఉల్లిపాయలు బయట నుంచి లోపలి వరకు తెల్లగా ఉంటాయి. వీటిలో ఎర్ర ఉల్లిపాయల్లో కనిపించే ఆంథోసయనిన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇవి కరకరలాడే స్వభావంతో పాటు ప్రత్యేకమైన ఘాటు రుచిని కలిగి ఉంటాయి. అయితే కొన్ని రకాల తెల్ల ఉల్లిపాయలు తక్కువ ఘాటుగా కూడా ఉంటాయి.

వీటిని సలాడ్లు, సాస్‌లు, చట్నీలు, స్టిర్ ఫ్రై వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. వంటకంలో ఉల్లి రంగు ఎక్కువగా కనిపించకూడదనుకునే సందర్భాల్లో తెల్ల ఉల్లిపాయలను ఎంచుకోవచ్చు.

ఎర్ర, తెల్ల ఉల్లిపాయలు రెండింటిలోనూ విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఇతర సహజ వృక్ష సమ్మేళనాలు ఉంటాయి. అయితే వీటిలోని కొన్ని యాంటీఆక్సిడెంట్ల పరిమాణం రంగును బట్టి మారుతుంది.

ఎర్ర ఉల్లిపాయల్లో ఆంథోసయనిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవే వాటికి ఎరుపు, ఊదా రంగును ఇస్తాయి. కొన్ని పరిశోధనల్లో ఎర్ర ఉల్లిపాయల్లో మొత్తం ఫ్లేవనాయిడ్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తెల్ల ఉల్లిపాయల్లోనూ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

అయితే అన్ని రకాల ఉల్లిపాయల్లో పోషకాల పరిమాణం ఒకేలా ఉండదు. ఉల్లి రకం, సాగు ప్రాంతం, నిల్వ చేసే విధానం వంటి అంశాలు కూడా వాటి పోషక విలువలపై ప్రభావం చూపుతాయి.

సలాడ్లు, పెరుగు పచ్చళ్లు, బిర్యానీలతో పాటు పచ్చిగా తినడానికి చాలామంది ఎర్ర ఉల్లిపాయలనే ఇష్టపడతారు. వాటి ఆకర్షణీయమైన రంగు, రుచి, కరకరలాడే స్వభావం ఇందుకు కారణాలు.

అయితే తెల్ల ఉల్లిపాయలను కూడా పచ్చిగా తినవచ్చు. వాటి ఘాటు రుచి కొందరికి ఎక్కువగా అనిపించవచ్చు. ఉల్లిపాయల ఘాటును కొంత తగ్గించాలంటే చిన్న ముక్కలుగా కోసి కొన్ని నిమిషాల పాటు చల్లటి నీటిలో నానబెట్టి ఉపయోగించవచ్చు.

ఎర్ర ఉల్లిపాయలు సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లు, గ్రిల్లింగ్, పచ్చళ్లకు బాగా సరిపోతాయి. తెల్ల ఉల్లిపాయలను సాస్‌లు, చట్నీలు, సలాడ్లు, స్టిర్ ఫ్రై వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చు.

అయితే ఈ రెండు రకాల ఉల్లిపాయలను ఒకదానికి బదులుగా మరొకటి కూడా ఉపయోగించుకోవచ్చు. వంటకానికి ఎలాంటి రుచి, రంగు కావాలనే దానిని బట్టి ఎంపిక చేసుకోవడం మంచిది.

ఎర్ర, తెల్ల ఉల్లిపాయలు రెండూ పోషక విలువలు కలిగినవే. యాంటీఆక్సిడెంట్ల విషయంలో ఎర్ర ఉల్లిపాయలకు కొంత ప్రత్యేకత ఉన్నప్పటికీ.. తెల్ల ఉల్లిపాయలను తక్కువగా అంచనా వేయలేం. వాటిలోనూ శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.

కాబట్టి ఎర్ర ఉల్లిపాయలే మంచివి, తెల్ల ఉల్లిపాయలు మంచివి కావని చెప్పడం సరైంది కాదు. రెండింటినీ మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. తాజా ఉల్లిపాయలను ఎంచుకుని, మీ రుచికి, వంటకానికి అనుగుణంగా ఉపయోగించుకోవడమే ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *