D-News: ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత ప్రభుత్వ పురస్కారం ‘ఒలియ్ దరజాలి దుస్త్లిక్’ (సుప్రీమ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్) లభించింది. తాష్కెంట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని మోదీకి ప్రదానం చేశారు.
భారత్–ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ఆర్థిక సంబంధాలను విస్తరించడంలో, ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.
పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ.. ఈ గౌరవాన్ని భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలకు, ఇరు దేశాల శతాబ్దాల నాటి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
‘దుస్త్లిక్’ అనే పదానికి భారత్, ఉజ్బెకిస్థాన్ రెండు భాషల్లోనూ ‘స్నేహం’ అనే అర్థం వస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రతిబింబమని అన్నారు.
కీలక రంగాల్లో సహకారంపై చర్చలు
పురస్కార ప్రదానోత్సవంతో పాటు ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, డిజిటల్ కనెక్టివిటీ, కీలక ఖనిజాలు, ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై మోదీ, మిర్జియోయేవ్ చర్చించారు.
ఈ గౌరవం భారత్–ఉజ్బెకిస్థాన్ మధ్య కొనసాగుతున్న స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలకు మరింత బలాన్నిచ్చే పరిణామంగా నిలిచింది.
