
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో గందరగోళంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని 14వ నంబర్ రేషన్ షాపులో సోమవారం ఉదయం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
అయితే కార్డులపై లబ్ధిదారుల గ్రామం పేరు తప్పుగా ముద్రించడంతో అధికారులు, లబ్ధిదారులు అవాక్కయ్యారు. తూప్రాన్ పట్టణానికి చెందిన లబ్ధిదారుల స్మార్ట్ కార్డులపై మున్సిపాలిటీ పేరుకు బదులుగా అదే మండలంలోని వట్టూర్ గ్రామం పేరు నమోదైంది.
ఈ విషయం లబ్ధిదారుల దృష్టికి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్డుల పంపిణీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు.
కార్డుల ముద్రణలో జరిగిన తప్పిదంపై కౌన్సిలర్ జైపాల్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటూ, సరైన వివరాలతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మళ్లీ ముద్రించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.


