తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు రెండు రోజుల నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో ఈ దీక్ష చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం చేస్తూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన, బీజేపీ నేతలు ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థుల సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

