
నాగార్జునసాగర్ విజయ విహార్ సమీపంలోని కృష్ణా నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో యాగ క్రతువులు కొనసాగుతున్నాయి.
కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు వరుణ యాగాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. రుత్వికులు గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
