
మియాపూర్‌లో ప్రభుత్వానికి చెందిన 550 ఎకరాల భూములు అందుబాటులోకి వస్తే వాటిని విక్రయించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ భూముల్లో పేదలకు ఇళ్లు, తెలంగాణ అమరవీరులకు నివాసాలు, ఉద్యమకారులకు స్థలాలు కేటాయించాలని సూచించారు. అలాగే మిగిలిన భూముల్లో పాఠశాలలు, కళాశాలలు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే తాము స్వాగతిస్తామని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, మియాపూర్ భూముల అంశంపై మాట్లాడారు.
ఉద్యమకారులకు 250 గజాల హామీ ఏమైంది?
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. మియాపూర్‌లో భూములు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ అక్కడ స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
హైదరాబాద్‌లోని పేదలకు 100 ఎకరాల్లో మంచి నివాస సముదాయాలు నిర్మించి ఇళ్లు అందించాలని సూచించారు. అలాగే మరో 100 ఎకరాలను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఇంకో 100 ఎకరాలను ఉద్యమకారులకు కేటాయించాలని ప్రతిపాదించారు. మిగిలిన భూములను విద్యా సంస్థల నిర్మాణానికి వినియోగించాలని అన్నారు.
ఎర్రవల్లిలో కాకుండా మియాపూర్‌లో అమరవీరులకు ఇళ్లు కట్టించండి
తెలంగాణ అమరవీరుల కోసం ఎర్రవల్లిలో కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ఎర్రవల్లిలో కాకుండా నగరంలోని మియాపూర్లోనే అమరవీరులకు అద్భుతమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు హైదరాబాద్‌లోనే నివాస సదుపాయాలు కల్పిస్తే తాము వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు.
హిల్ట్ పాలసీపై కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూముల వ్యవహారంపైనా కేటీఆర్ స్పందించారు. ఈ పాలసీకి సంబంధించిన వ్యవహారాల్లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు, ప్రయోజనాలకు ఆకర్షితులై నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
మరో ఏడాది లోపల కేసీఆర్ తిరిగి రాజకీయంగా క్రియాశీలం అవుతారని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూముల వ్యవహారాలపై సమీక్షించి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అడ్డుకట్ట వేస్తామని వ్యాఖ్యానించారు.
