
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చలు కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల మహారాష్ట్రతో జరిగిన చర్చల పురోగతిని సమీక్షించిన ఆయన.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైన అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ముంపు భూములకు పరిహారం.. జాయింట్ అకౌంట్‌లో నిధులు
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కారణంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన నిధులను ప్రత్యేకంగా జాయింట్ అకౌంట్‌లో జమ చేస్తామని వెల్లడించారు.
ముంపునకు గురయ్యే ప్రాంతాలు, భూముల విస్తీర్ణంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా సర్వే నిర్వహించుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అలాగే మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారం, ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు, సంబంధిత పత్రాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు సంబంధించిన సమగ్ర వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో చర్చలను ముందుకు తీసుకెళ్లి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.
