
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్ మెడికల్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. విచారణ అనంతరం నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించింది. ఒకేసారి 14 మంది విద్యార్థులపై చర్యలు తీసుకోవడం వైద్య కళాశాల వర్గాల్లో కలకలం రేపింది.
ఎన్ఎంసీకి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
కళాశాలలోని కొందరు సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు వారం రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది.
విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో పాటు, ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్ వాల్యా, వివిధ విభాగాల అధిపతులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణలో వెల్లడైన అంశాలను సమీక్షించిన అనంతరం 14 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
ఆరోపణల తీవ్రతను బట్టి నలుగురు విద్యార్థులకు ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిసింది.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదు ద్వారానే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా వెల్లడించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని, ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
కళాశాల ప్రాంగణంలో కానీ, హాస్టల్లో కానీ ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
