D Spiritual: Nov 11: యాదగిరిగుట్టలో నవంబర్ 20 నుంచి కార్తీక ఉత్సవాలు

రాష్ట్రంలోని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాల సందడి కొనసాగుతోంది. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోనూ నవంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 20న మాడుగుల నాగఫణిశర్మ ఆధ్యాత్మిక ప్రవచనం, తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

నవంబర్ 21న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 22న పరంపర సంస్థ ఆధ్వర్యంలో అభినేత్రి బృందం తెలంగాణ దేవాలయాల ఇతివృత్తంతో ప్రత్యేక నృత్యప్రదర్శన ఇవ్వనుంది.

అలాగే ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీలక్ష్మీనరసింహస్వామి నామార్చన సహిత కోటి పుష్పార్చన మహాపర్వాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. కార్తీక ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *