హైదరాబాద్లో నిర్వహించిన ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ జంగ్ సైరన్’ సభలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను పరిరక్షించడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ విద్యకు సంబంధించిన విధానాల్లో ఇటీవల చోటుచేసుకున్న నిర్లక్ష్యం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం, స్కాలర్షిప్ల బకాయిలు, జూనియర్ కాలేజీలను వేధిస్తున్న సమస్యలపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఏకతాటిపైకి రావాలని కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి యువతకు నాణ్యమైన అందుబాటులో ఉండే ఫీజు భారం లేని ఇంటర్మీడియట్ విద్య అందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇంటర్ విద్య పరిరక్షణ కోసం ‘జంగ్ సైరన్’ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కవిత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
