
D News: ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన తాజా చిత్రం ‘డోరత్తి’పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కీర్తి సురేష్, సనంద్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘డోరత్తి’ కథ చాలా కాలంగా తన మనసులో ఉందని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. కరోనా సమయంలో ఈ కథకు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెప్పారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ కథ మదురై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుందని వివరించారు. వారి జీవితాల్లోకి డోరత్తి అనే యువతి వచ్చిన తర్వాత చోటుచేసుకునే పరిణామాలే సినిమా కథాంశమని చెప్పారు.
ఈ సినిమాకు పెద్ద హీరోలు అవసరం లేదని భావించానని, సనంద్, రిషికాంత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని కార్తీక్ తెలిపారు. కీర్తి సురేష్ కూడా డోరత్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసించారు.
ఇళయరాజాతో పనిచేసిన అనుభవాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఆయనను సంగీతం అందించమని అడగడానికి తొలుత చాలా భయపడ్డానని చెప్పారు. చివరకు ధైర్యం చేసి తన సినిమాను చూపించి, నచ్చితే సంగీతం అందించాలని కోరినట్లు వెల్లడించారు. సినిమా చూసిన వెంటనే ఇళయరాజా స్పందించి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు రమ్మని, పని ప్రారంభిద్దామని చెప్పారని తెలిపారు.
ఆ తర్వాత దాదాపు 25 రోజుల పాటు ఇళయరాజా ఈ సినిమా కోసం నిరంతరంగా పనిచేశారని , ఆయనతో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవమని, సినిమా రంగంలో ఇళయరాజా వంటి వ్యక్తి మరొకరు లేరని అన్నారు.
ముఖ్యంగా ఇళయరాజా గాత్రాన్ని తాను దైవ స్వరంగా భావిస్తానని, సినిమాలోని ‘కల్యాణ ధీరే’ పాటకు ఇళయరాజానే స్వయంగా గాత్రం అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారిందన్నారు. ఆ పాటను ఆల్బమ్గా విడుదల చేసిన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు.
