
గోవాలో జరిగిన ఆక్వామోగా స్విమ్మథాన్ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల స్విమ్మర్ కార్తీక్ ఆగ్నేయ కొల్లి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఎండ్యూరో స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బాంబోలిమ్ బీచ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
న్యూరోడైవర్జెంట్ స్విమ్మర్ అయిన కార్తీక్.. 5 కిలోమీటర్ల ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌ను కేవలం 1 గంట 44 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేశాడు. స్విమ్ గైడ్ జస్టిన్ మెల్లోకాస్ట్రో మార్గదర్శకత్వంలో ఈ అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ పోటీల్లో కార్తీక్ మూడు విభాగాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. డిజెబిలిటీ (పారా ఎస్-14 జూనియర్), జూనియర్స్ (16-24 ఏళ్లు), ఓవరాల్ మెన్స్ ఛాంపియన్షిప్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు.
ఒకే పోటీలో మూడు విభాగాల్లో విజేతగా నిలవడం ద్వారా కార్తీక్ తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి విజయంపై తెలంగాణ పారా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శమంత రెడ్డితో పాటు పలువురు క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు.
చిన్న వయసులోనే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్న కార్తీక్.. తన పట్టుదల, కృషితో యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
