Sachin Tendulkar Recreates Childhood Pose with 49-Year-Old Bat, Shares Nostalgic Photos

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. దాదాపు 49 ఏళ్ల క్రితం చిన్నతనంలో బ్యాట్ పట్టుకుని దిగిన ఫోటోను మరోసారి గుర్తుచేస్తూ, అదే బ్యాట్‌తో తాజాగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

చిన్నప్పుడు బ్యాట్ పట్టుకుని కెమెరాకు ఫోజిచ్చిన సచిన్.. ఇప్పుడు అదే బ్యాట్‌తో దాదాపు అదే తరహాలో మరో ఫోటోకు పోజిచ్చారు. ఈ రెండు ఫోటోలను కలిపి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి ‘పెహ్లీ బ్యాట్ కీ బాత్ హై.. 49 సాల్ బాద్ భీ మేరా సాత్ హై’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆ బ్యాట్ తన దగ్గరే ఉందని సచిన్ వెల్లడించారు. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై తనకున్న మక్కువను, ఆ రోజులతో ముడిపడిన జ్ఞాపకాలను ఈ ఫోటోలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. కాలం మారినా, తనతో పాటు ఆ బ్యాట్ కూడా ఇన్నేళ్లుగా ఉండటం విశేషం.

సచిన్ పంచుకున్న ఈ అరుదైన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు తమ అభిమాన క్రికెటర్ జ్ఞాపకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మాస్టర్‌తో పాటు ఎప్పటికీ ఉండే నమ్మకమైన సహచరి’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా, మరికొందరు ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అంటూ ప్రశంసలు కురిపించారు.

చిన్ననాటి జ్ఞాపకాలను ఎంతో విలువగా చూసుకునే సచిన్.. ఈ ఫోటోలతో అభిమానుల్లో మరోసారి నాస్టాల్జిక్ అనుభూతిని కలిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *