D-News: భారత్‌లో ల్యాప్‌టాప్ మార్కెట్ వేగంగా మారుతోంది. గతంలో GPU ఉన్న ల్యాప్‌టాప్‌లు అంటే ప్రధానంగా గేమింగ్ కోసం ఉపయోగించే పరికరాలుగా భావించేవారు. కానీ ఇప్పుడు ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, విద్యార్థులు కూడా GPU ఆధారిత ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ AI, LLMలు, AI ఏజెంట్ల వినియోగం పెరగడంతో ఈ ట్రెండ్ మరింత వేగం పుంజుకుంది.

భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతుండగా.. 10 లక్షలకు పైగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చదువుతున్నారు. దీంతో ఈ వర్గం ల్యాప్‌టాప్ తయారీ సంస్థలకు కీలక వినియోగదారులుగా మారుతోంది. Acer India సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ గ్రూప్ జీఎస్ సోంధీ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం GPU ఉన్న గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, సాధారణ ల్యాప్‌టాప్‌లు వేర్వేరు విభాగాలుగా ఉండేవని, ఇప్పుడు ఈ రెండు విభాగాలు కలిసిపోతున్నాయని తెలిపారు. అయితే గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కోడింగ్‌కు ఉపయోగపడినా.. అవి బరువుగా, పెద్దగా ఉండటంతో డెవలపర్లు తేలికైన, సన్నని GPU ల్యాప్‌టాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో భారత పీసీ మార్కెట్‌లో ప్రీమియం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ పీసీల ధరలు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు ఉండగా.. అప్‌గ్రేడ్ సెగ్మెంట్ రూ.60,000-70,000 మధ్య ఉంది. రూ.80,000కు పైగా ధర కలిగిన పీసీలను ప్రీమియం సెగ్మెంట్‌గా పరిగణిస్తున్నారు. వినియోగదారులు ఎక్కువ కాలం ఉపయోగించుకునే ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సోంధీ తెలిపారు. సాధారణంగా ఒక ల్యాప్‌టాప్‌ను మూడు నుంచి నాలుగేళ్ల వరకు ఉపయోగిస్తున్నారని చెప్పారు.

మార్కెట్ వాటా పరంగా Acer భారత్‌లో రెండో అతిపెద్ద పీసీ బ్రాండ్‌గా ఎదిగింది. IDC ప్రకారం 2026 తొలి త్రైమాసికంలో సంస్థ 21.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. Lenovo, Dell వంటి ప్రత్యర్థులను అధిగమించడం Acerకు కీలక విజయంగా మారింది. అయితే AI డేటా సెంటర్ల విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత ఏర్పడటం పీసీ తయారీ సంస్థలకు సవాలుగా మారింది. గతంలో పీసీ తయారీ ఖర్చులో మెమరీ వాటా 15-20 శాతం ఉండగా.. ప్రస్తుతం అది CPU ధరను కూడా మించే స్థాయికి చేరిందని సోంధీ తెలిపారు. దీంతో Acer ముందుగానే ఆరు నెలల ఇన్వెంటరీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వ రంగంలోనూ పీసీలకు డిమాండ్ బలంగానే ఉంది. తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ నుంచి 5.5 లక్షల యూనిట్ల భారీ ఆర్డర్ Acerకు లభించింది. అలాగే Canara Bank నుంచి దాదాపు 10,000 యూనిట్ల ఆర్డర్‌ను కూడా సంస్థ పొందింది. అయితే పెరిగిన మెమరీ ధరల కారణంగా కొన్ని ప్రభుత్వ టెండర్లు రద్దయ్యాయి. వినియోగదారుల విభాగంలో కొంత మందగమనం ఉన్నప్పటికీ.. పండగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందని Acer అంచనా వేస్తోంది. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్‌లు, EMI ఆఫర్లు ప్రీమియం ల్యాప్‌టాప్‌ల విక్రయాలను పెంచుతున్నాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో సుమారు 50 శాతం కొనుగోళ్లు EMIల ద్వారానే జరుగుతున్నాయని కంపెనీ చెబుతోంది.

మరోవైపు PC మార్కెట్‌లో Intel, AMDతో పాటు Apple, Qualcomm, Nvidia వంటి సంస్థల ప్రవేశంతో పోటీ మరింత పెరిగింది. AI సామర్థ్యాలు, మెరుగైన పనితీరు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త తరం ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌ను వేగంగా మార్చుతున్నాయి.