
D-News: చైనాతో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ ఏఐ రేసులో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యూహాన్ని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై సోమవారం ప్రచురించిన సుదీర్ఘ వ్యాసంలో.. అమెరికా చైనాతో పోటీపడాలని, ఏఐపై ప్రభుత్వ నియంత్రణ లేదా “ప్రభుత్వ నిరంకుశత్వం” ఏర్పడకుండా చూడాలని, భవిష్యత్తులో సూపర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు
సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సామర్థ్యాలు మానవ మేధస్సును మించే స్థాయికి చేరుకునే సైద్ధాంతిక దశ. ఈ సాంకేతికతను కొద్దిమంది సంస్థలు లేదా ప్రభుత్వాల చేతుల్లో కేంద్రీకరించకుండా ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఓపెన్ వెయిట్ ఏఐ మోడళ్లు కీలకమని ఆయన పేర్కొన్నారు. వీటిలో ఏఐ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నిర్దేశించే మోడల్ వెయిట్స్‌ను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇవి పూర్తిస్థాయి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌కు భిన్నమైనవి. ఎందుకంటే మోడల్‌కు సంబంధించిన మొత్తం అంతర్గత కోడ్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచరు.
ఇదే సమయంలో OpenAI, Anthropic వంటి సంస్థలు ప్రధానంగా క్లోజ్డ్ ఏఐ మోడళ్లపై దృష్టి సారిస్తున్నాయి. వీటిని వినియోగదారులు స్వయంగా పరిశీలించలేని “బ్లాక్ బాక్స్” మోడళ్లుగా పరిగణిస్తారు. ఈ సంస్థలకు పోటీగా నిలిచేందుకు మెటా తన Meta Superintelligence Labsలో ఇప్పటికే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. సోమవారం మెటా “Glimmer” అనే కొత్త ఓపెన్ వెయిట్ మోడల్‌ను కూడా ప్రకటించింది. ఇతర మోడళ్లతో పోలిస్తే ఇది తక్కువ కంప్యూటింగ్ శక్తిని ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ మానవ జోక్యం లేకుండానే వివిధ పనులు చేయగల ఏఐ ఏజెంట్లు, సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించేంత సామర్థ్యం దీనికి ఉందని పేర్కొంది.
చైనాలోని Alibaba, DeepSeek, Moonshot వంటి సంస్థలు ఇటీవలి కాలంలో తక్కువ ఖర్చుతో అధునాతన ఓపెన్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేశాయి. దీంతో అమెరికా కంపెనీలు తమ ఏఐ మోడళ్ల ధరలను తగ్గించడంతో పాటు చౌకైన ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఏఐ నియంత్రణపై అమెరికాలో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. అధునాతన ఏఐ మోడళ్ల విడుదలకు ముందు స్వచ్ఛంద సమీక్ష ప్రక్రియను ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్‌లో ఆదేశించారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సిన ఆగస్టు 1 గడువును ప్రభుత్వం దాటిపోయింది.
అమెరికాలో ఓపెన్ మోడళ్లకు అనుకూలమైన నియంత్రణ విధానం ఉంటే మెటాకు చైనా సంస్థలతో పాటు OpenAI, Anthropicతో పోటీపడేందుకు మరింత ప్రయోజనం కలుగుతుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. ఒక్క నెల ఆలస్యం కూడా అమెరికా ఏఐ నాయకత్వానికి గణనీయమైన ముప్పును కలిగించవచ్చని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా డేటా సెంటర్ల నిర్మాణంపై స్థానికంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. మెటా తన సదుపాయాల చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడానికి 1 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయనుంది. ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న మెటా.. 2026లో గరిష్ఠంగా 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తోంది.
