
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేరంటేనే గిట్టడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. బుధవారం వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ‘కేసీఆర్ కంటి వెలుగు’ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించిందన్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ‘కేసీఆర్ కంటి వెలుగు’, ‘కేసీఆర్ కిట్టు’ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ‘కేసీఆర్ కిట్టు’ పేరును మార్చి ‘ఇందిరమ్మ’ పేరుతో కొనసాగించినా బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు మేలు చేసే పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
అధికారం శాశ్వతం కాదని ప్రభుత్వాలు మారుతుంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగించాలన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ అధికారంలో లేకపోయినా ప్రజల ఇళ్లలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వీర్నపల్లి గర్జనపల్లి గ్రామాల్లో సుమారు 5 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,371 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని చెప్పారు. వీరిలో 250 మంది చిన్నారులు ఉన్నారని 171 మందికి సిరిసిల్లలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వీర్నపల్లి గ్రామానికి వైకుంఠ రథం అందించడంతో పాటు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 24 మంది బాధితులకు ఇళ్ల నిర్మాణ బిల్లులు ఇప్పించేందుకు కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ హయాంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త మండలాలు, తండాలను గ్రామపంచాయతీలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.
కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్ చైర్మన్ రవీందర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, సర్పంచ్ జ్యోత్స్న, సబేర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు మల్లేశం, సురేశ్‌నాయక్, సంతోష్‌నాయక్, కళావతి, భూల, చాంద్‌పాషా, రవి, భాస్కర్, సాగర్, దేవరాజు, రాజేశ్, శ్రీకాంత్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
