
D Spiritual: Sept 7: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. తిరుమల కొండపై రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కొత్తగా ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ‘శ్రీవారి ధర్మరథం’ పేరుతో నడిచే ఈ బస్సుల్లో భక్తులు తిరుమలలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి ప్రకటించిన రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో భాగంగా తొలి విడతలో 15 బస్సులు ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు
గత జూన్లో శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. 25 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, డ్రైవర్ల నిర్వహణకు సంబంధించిన సదుపాయాలను కూడా విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 15 బస్సులు తిరుమలకు చేరుకోగా.. మిగిలిన 10 బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
తిరుమలలో ప్రస్తుతం ఉన్న ధర్మరథాల సంఖ్య తక్కువగా ఉండటంతో భక్తుల రద్దీ సమయంలో రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బస్సుల ట్రయల్ రన్ కూడా పూర్తయింది. టీటీడీ ఎలక్ట్రిక్ బస్ స్టేషన్లో వీటి కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పరిశీలించారు.
హుండీ బియ్యానికి ఈ-వేలం
మరోవైపు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బియ్యానికి ఈ-వేలం నిర్వహించనున్నారు. మొత్తం 7,938 కిలోల బియ్యాన్ని ఈ నెల 8వ తేదీన ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వేలంలో ఆసక్తి ఉన్నవారు konugolu.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. అలాగే 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా కూడా ఈ-వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
