
D Spiritual: Nov 20: మామూలుగా చాలామంది నరదృష్టి తగిలింది, దిష్టి పడింది అంటూ మాట్లాడుతుంటారు. ఈ మాటలను మనం తరచుగా వింటూనే ఉంటాం. నరదృష్టి అంటే నెగటివ్ ఎనర్జీ, ఈ నెగటివ్ ఎనర్జీ కారణంగానే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కొందరి చూపులు శుభం కలిగించవని భావించే వారు చాలామందే ఉన్నారు. ఇంట్లో కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తే, ఆ ఇంటికి నరదిష్టి బలంగా ఉందని భావించవచ్చని నిపుణులు అంటున్నారు.
మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఎక్కువగా అరుస్తూ, ఏడుస్తూ వినిపిస్తే, అది ఇంటి పైన నరదృష్టి ఉందనే సూచనగా పండితులు భావిస్తారు. అలాంటి సందర్భంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం మంచిదని సూచిస్తున్నారు. అదేవిధంగా, ఇంట్లో ఎక్కడైనా బూజు ఏర్పడితే, అది రాబోయే కష్టాలను సూచించే సంకేతమని అంటారు. బూజు కారణంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉన్నందున, దానిని వెంటనే తొలగించడం మంచిదని చెబుతున్నారు.
ఇక శారీరకంగా ఏ అనారోగ్య సమస్యలు లేకపోయినా, అకస్మాత్తుగా కళ్లుతిరుగడం, వాంతులు వచ్చినట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే, అది దిష్టి తగిలిన సంకేతంగా పరిగణిస్తారు. అలాంటప్పుడు ఉప్పు, నిమ్మకాయ వంటి వాటితో దిష్టి తీయించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, రాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ రావడం కూడా దుష్టశక్తుల ప్రభావంగా భావిస్తారు. అలాంటి సందర్భాల్లో హనుమాన్ మంత్రం జపించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో ఆకస్మికంగా కలహాలు, గొడవలు పెరగడం, తులసి మొక్క ఎండిపోవడం వంటి సంఘటనలు కనిపిస్తే, అది కూడా ఇంటికి నరదిష్టి తగిలిన సంకేతమేనని నిపుణులు సూచిస్తున్నారు.
