
D Spiritual: Nov 20: గురువారం ప్రత్యేక పూజలు: ఆర్థిక సమస్యల నివారణకు పండితుల సూచనలు
హిందూమతంలో వారం రోజులకు ప్రత్యేకమైన ఆరాధనా విధానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం విష్ణుమూర్తి మరియు సాయిబాబా పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గురువారం విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించడం ద్వారా ఆశ్చర్యకరమైన శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది.
పండితుల వివరాల ప్రకారం, గురువారం తెల్లవారు జామునే లేచి స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదమని అంటున్నారు. అనంతరం వైదిక పద్ధతిలో విష్ణుమూర్తిని పూజించి, హారతి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పసుపు పూలు, తులసి పూలను సమర్పించడం శ్రేయస్కరంగా భావిస్తున్నారు. “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని 108 సార్లు జపించడం కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. ప్రతి వారం ఇలా ఆరాధన చేస్తే జీవితంలోని అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు గురువారం తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించడం ఉత్తమమని సూచిస్తున్నారు. స్నానం చేసి విష్ణుపూజ అనంతరం ఆ తులసి ఆకులను శుభ్రమైన పసుపు లేదా ఎరుపు వస్త్రంలో కట్టి, డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని నమ్మకం.
వ్యాపారంలో లాభాలు రావాలనుకునే వారు గురువారం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరినీ పసుపు, కుంకుమతో ఆరాధించాలట. పూజ తర్వాత ఉపయోగించిన పసుపు, కుంకుమలను వస్త్రంలో కట్టి వ్యాపార స్థలంలో ఉంచడం వల్ల వ్యాపార సమస్యలు తగ్గి, లాభాలు పెరుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.
ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావించే వారు గురువారం ఒక పాత్ర నీటిలో కొంత గంగా జలం, తులసి ఆకులను వేసి పూజ గదిలో పూజించాలి. అనంతరం ఆ నీటిని ఇంట్లో చుట్టూ చల్లితే నెగిటివ్ ఎనర్జీ తగ్గి, కుటుంబ సమస్యలు శాంతిస్తాయని విశ్వాసం.
ఈ ఆచారాలు హిందూ సంప్రదాయంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయని, భక్తిశ్రద్ధలతో చేస్తే శుభఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
