
D spiritual: Nov 20: మామూలుగా హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు ప్రతి రోజూ దీపారాధన చేస్తే, మరికొందరు వారంలో కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే దీపాన్ని వెలిగిస్తారు. ఇంకొందరు పండుగలు, శుభదినాలు వచ్చినప్పుడు మాత్రమే దీపారాధన చేస్తారు. అయితే నిత్యం దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. దేవుడి ముందు ప్రతిరోజూ దీపం వెలిగించి నమస్కారం చేస్తే అనేక సత్ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.
దీపారాధన చేసే సమయంలో చాలామందికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏవే చేయకూడదు? అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యమైంది. దీపారాధనలో ముందుగా కుందులో నూనె పోసి, ఆ తర్వాత వత్తులు వేయాలి. కొందరు దీనికి విరుద్ధంగా ముందు వత్తులు వేసి తర్వాత నూనె పోస్తారు—అయితే ఇది శాస్త్రోక్తంగా సరైన పద్ధతి కాదట. దీపారాధన కోసం వెండి కుందులు, మట్టి కుందులు, పంచలోహ కుందులు అత్యంత శుభప్రదం. స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదని చెబుతారు.
ప్రతిరోజూ దీపపు కుందులను శుభ్రం చేసిన తర్వాతనే పూజ చేయాలి. వత్తులు మార్చి కుందులను శుభ్రం చేయకుండా అలాగే పూజ చేయడం మంచిది కాదు. దీపాన్ని నేలపై నేరుగా పెట్టకూడదు; చిన్న పల్లెలో లేదా తమలపాకుపై ఉంచడం శ్రేయస్కరం. దీపాలను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించడం కూడా తగదు. సాధారణంగా అగరబత్తి సహాయంతో దీపాలను వెలిగించాలని సూచిస్తున్నారు. కొవ్వొత్తితో దీపం వెలిగించడం అస్సలు మంచిదికాదు.
ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దాని ద్వారా కానీ, లేదా ఒక అడ్డవత్తిని వెలిగించి దాని సహాయంతో కానీ దీపారాధన చేయాలి. అలాగే అగరబత్తి, ఏకహారతి, కర్పూర హారతి వంటి ఏ హారతినైనా దీపంతో నేరుగా వెలిగించకూడదు. ఇవన్నీ పాటించడం శాస్త్రోక్తంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇకమీదట దీపారాధన చేసేప్పుడు ఈ నియమాలను తప్పకుండా గుర్తుంచుకుని అనుసరించాలి.
