
పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను బీఏపీఎస్ మత సంస్థకు చెందిన ప్రతినిధి బృందం సందర్శించిన సమయంలో మహిళా సిబ్బందిని విధుల నుంచి పక్కనపెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. యాజమాన్యం జారీ చేసిన ఈ వివక్షపూరిత ఆదేశాలను నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఈఫిల్ టవర్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ ఘటనపై ఫ్రాన్స్ మంత్రులు, పలువురు రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని పారిస్ మేయర్ ఆదేశించారు. మరోవైపు, ఘటనపై బీఏపీఎస్ సంస్థ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఈఫిల్ టవర్ వద్ద ఊహించని వివాదం చోటుచేసుకుంది. హిందూ మత ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారనే ఆరోపణలతో ఈఫిల్ టవర్ సిబ్బంది నిరసనకు దిగారు.
యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సామూహికంగా సమ్మె చేపట్టడంతో సోమవారం ఈఫిల్ టవర్ సందర్శకులకు పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీయడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం, పారిస్ నగరపాలక సంస్థ ఘటనపై తక్షణమే విచారణకు ఆదేశించాయి.
పారిస్ శివార్లలో కొత్తగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన బీఏపీఎస్ (బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ) ప్రతినిధి బృందం ఫ్రాన్స్‌కు చేరుకుంది. ఈ బృందంలోని సుమారు 100 మంది సభ్యులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ బుకింగ్ చేసుకున్నారు.
అయితే, తమ పర్యటన సందర్భంగా మహిళలతో ప్రత్యక్ష సంభాషణలు లేదా ముఖాముఖి పరిచయాలను సాధ్యమైనంత వరకు నివారించాలని బీఏపీఎస్ ప్రతినిధులు ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ ఎస్ఈటీఈని కోరినట్లు సమాచారం. ఈ అభ్యర్థనకు సంస్థ అంగీకరించి, పర్యటన సమయంలో మహిళా సిబ్బంది బృందానికి కనిపించకుండా ఉండేలా కొన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
మహిళా ఉద్యోగులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోకి వెళ్లకూడదని ఆదేశించడంతో పాటు, కొన్ని చోట్ల వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించినట్లు సిబ్బంది ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందిన మహిళా ఉద్యోగులకూ ఇదే విధమైన సూచనలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిణామం ఉద్యోగుల మధ్య చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. మహిళా సిబ్బందిని వారి లింగం ఆధారంగా విధుల నుంచి పక్కన పెట్టడం సమానత్వం, ఉద్యోగ హక్కులకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
