
D News: Sept 8: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) CEN 09/2025 నోటిఫికేషన్‌కు సంబంధించిన లెవెల్-1 పోస్టుల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాయి. ఆగస్టు 3 నుంచి 25 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను పరిశీలించుకోవచ్చు.
ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు వాటిని నమోదు చేసుకునేందుకు రైల్వే బోర్డు అవకాశం కల్పించింది. ఒక్కో ప్రశ్నకు రూ.50 రుసుము చెల్లించి అభ్యంతరాలను నమోదు చేయవచ్చు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
అభ్యర్థులు నిర్ణీత గడువులోగా మాత్రమే తమ అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో సమర్పించాలి. అభ్యంతరం సరైనదిగా తేలితే, ఆ ప్రశ్నకు చెల్లించిన రూ.50 రుసుమును అభ్యర్థి ఖాతాలోకి తిరిగి జమ చేస్తారు.
సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేదా విజ్ఞప్తులను స్వీకరించబోమని ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం బోర్డు తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపింది. కాబట్టి అభ్యర్థులు గడువులోగా ఆన్సర్ కీని పరిశీలించి, అవసరమైతే తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
