
D Spiritual: Dec 4: చాలా మంది వారి ఇంటిలో అలంకరణ వస్తువుగా శంఖాన్ని పెట్టుకోవడం మనం చూస్తుంటాము. కొందరు ఈ శంఖాన్ని ఆధ్యాత్మికంగా భావించగా, మరికొందరు అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అయితే శంఖాన్ని అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా పూజించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. శంఖాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఉంది. శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవితో పాటు శంఖమూ ఉద్భవించడం వల్ల దానికి ప్రత్యేక పావిత్ర్యం కలిగింది.
ఇంట్లో శంఖం ఉన్నప్పుడు దాన్ని ఎలా పూజించాలి అనే విషయం చాలామందికి తెలియక గందరగోళం ఏర్పడుతుంది. శంఖ పూజ విధానానికి వస్తే — శంఖాన్ని ఎల్లప్పుడూ దేవుడి గదిలోనే ఉంచాలి. వెండి పళ్లెంలో బియ్యం వేసి, దాని పై శంఖాన్ని ఉంచి పూజించడం శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శంఖాన్ని పసుపు నీటితో శుభ్రం చేసి, అనంతరం పాలతో అభిషేకం చేయాలి.
అభిషేకం చేసిన తర్వాత ప్రతిరోజూ దూపదీపాలు వేసి శంఖాన్ని పూజించాలి. ఈ విధంగా పూజిస్తే సకల పాపాలు తొలగి, ఇంటికి అదృష్టం మరియు లక్ష్మీ కటాక్షం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పెట్టుకునే శంఖం తెలుపు రంగులో ఉండటం అత్యుత్తమం. ప్రతి రోజూ పూజలు చేస్తూ, వారానికి ఒకసారి పసుపు–కుంకుమలతో శంఖాన్ని ప్రత్యేకంగా పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వసంపదలు లభిస్తాయని విశ్వసిస్తారు.
