
D Spiritual: Dec 4: మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకు అపారమైన నమ్మకం కూడా ఉంది. అందుకే ఇల్లు నిర్మించుకునేటప్పుడు మాత్రమే కాకుండా, ఇంట్లో వస్తువులను అమర్చుకునేటప్పుడు కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తుపై విశ్వాసం ఉన్న వారు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే వాస్తు నియమాలను ఉల్లంఘిస్తారు. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని పనులు వాస్తు ప్రకారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఇవి అనేక సమస్యలకు కారణమవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం దూరమయ్యే పరిస్థితులను సృష్టిస్తాయని భావిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట చేయరానీ పనుల్లో మొదటిది చీపురు పట్టుకొని చెత్త ఊడ్చడం. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురుతో చెత్త ఊడ్చకూడదని చెబుతారు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి రాత్రి సమయంలో చెత్త ఊడ్చితే లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందని నమ్మకం.
అలాగే రాత్రి వేళ తల దువ్వుకోవడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. మహిళలు సూర్యాస్తమయం కంటే ముందే తల దువ్వుకోవాలి. సూర్యాస్తమయం సమయంలో లేదా ఇంట్లో పూజ చేసిన వెంటనే తల దువ్వుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
మరొక వాస్తు నియమం ప్రకారం మంచం మీద కూర్చొని భోజనం చేయడం సరికాదు. పురుషులు, మహిళలు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. ఇది వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉంటుంది.
అలాగే సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటమూ వాస్తు ప్రకారం తప్పు. ఈ సమయంలో బట్టలు ఉతికితే ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముందని నమ్మకం.
