
D Spiritual: Dec 17: ధనుర్మాస వేడుకలకు యాదగిరి ఆలయం సిద్ధం:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం (డిసెంబర్ 16) నుంచి వచ్చే నెల జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుప్పావై వేడుకల నిర్వహణ:
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ చేసే తిరుప్పావై పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజూ వేకువజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంలోని ఉత్తర భాగం హాల్‌లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం, మార్గళి నివేదన వంటి వేడుకలు నిర్వహిస్తారు.
కైంకర్యాల్లో మార్పులు:
ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కైంకర్యాల వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు వేకువజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాతం నిర్వహిస్తారు.
ధనుర్మాస కైంకర్యాల వివరాలు:
వేకువజామున 4 గంటల నుంచి 4.30 గంటల వరకు తిరువారాధన జరుగుతుంది. అనంతరం 4.30 నుంచి 5 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన, చాత్మర సేవలు జరుగుతాయి. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు నిజాభిషేకం, 7 నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
