
D Spiritual: Feb 13: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు హాజరయ్యారు. భారీగా భక్తుల రాకతో హుండీ ఆదాయం సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. అయితే లెక్కింపు పూర్తయ్యాక ఆ అంచనాలు నిజం కాలేదని వెల్లడైంది. మొత్తం ఆదాయం రూ.13,25,83,269 మాత్రమే నమోదైంది. గత జాతరతో పోలిస్తే స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. 2024 జాతరలో 540 హుండీలు ఉండగా, ఈసారి 288 హుండీలు అదనంగా ఉంచారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు 500 మంది సిబ్బంది, వాలంటీర్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు నిర్వహించారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో సీసీటీవీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తయింది. హుండీల్లో భారత కరెన్సీతో పాటు విదేశీ నోట్లు, బంగారం, వెండి, గిల్టు నగలు కూడా లభించాయి.
హుండీల్లో వచ్చిన మొత్తంలో 33 శాతం స్థానిక పూజారులకు ఇవ్వాల్సి ఉండగా, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. గత జాతరల ఆదాయాన్ని పరిశీలిస్తే 2018లో రూ.8.14 కోట్లు, 2020లో రూ.9.87 కోట్లు, 2022లో రూ.12.45 కోట్లు, 2024లో రూ.13.25 కోట్లు వచ్చినట్లు నమోదైంది. ఈసారి కూడా దాదాపు అదే స్థాయి ఆదాయం రావడం గమనార్హం. హుండీల సంఖ్య పెరిగినా ఆదాయం పెద్దగా పెరగకపోవడం అధికార వర్గాల్లో విశ్లేషణకు దారితీస్తోంది.
